డ్యూటీ టైమ్‌‌లో ప్రైవేట్ ప్రాక్టీస్ కు వీల్లేదు..పీజీ మెడికల్ కాలేజీలు రూల్స్ పాటించాల్సిందే : ఎన్ఎంసీ

డ్యూటీ టైమ్‌‌లో ప్రైవేట్ ప్రాక్టీస్ కు వీల్లేదు..పీజీ మెడికల్ కాలేజీలు రూల్స్ పాటించాల్సిందే : ఎన్ఎంసీ
  • అమల్లోకి పీజీఎంఎస్సార్ సవరణలు

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా పీజీ మెడికల్ కోర్సులు(ఎండీ, ఎంఎస్, సూపర్ స్పెషాలిటీ) అందిస్తున్న కాలేజీలు, హాస్పిటల్స్ కు సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. పీజీ కోర్సుల నిర్వహణపై మినిమం స్టాండర్డ్స్ ఆఫ్ రిక్వైర్​మెంట్స్-(పీజీఎంఎస్సార్​)–2023   నిబంధనల్లో కీలక సవరణలు చేసి అమల్లోకి తెచ్చింది. తాజా రూల్స్ ప్రకారం.. కాలేజీల్లో పనిచేసే ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ ఇకపై డ్యూటీ టైమ్‌‌లో ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు.

బయోమెట్రిక్ అటెండెన్స్ వేయడంతో పాటు ఏడాదిలో 75 శాతం హాజరు ఉండాలి. టీచింగ్ హాస్పిటల్స్ లో నిత్యం కనీసం 80 శాతం బెడ్లు రోగులతో నిండి, మొత్తం బెడ్లలో 15 శాతం ఐసీయూ బెడ్లు ఉండాలి. బ్లడ్ బ్యాంక్ సదుపాయం తప్పనిసరి. విద్యార్థులకు లైవ్ లో పాఠాలు చెప్పేందుకు ఆపరేషన్ థియేటర్లలో జరిగే సర్జరీలను సెమినార్ హాళ్లలో టెలికాస్ట్ చేసేలా హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలి. కాలేజీ ప్రాంగణంలో కెమెరాలు ఏర్పాటు చేయాలి. ప్రతి నెలా రోగుల సంఖ్య, సర్జరీలు, ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ వివరాలను కాలేజీ వెబ్‌‌సైట్‌‌లో అప్‌‌డేట్ చేయాలి.